Election Commission: ఎన్నికల కమిషన్ గూటిలో కుట్రల మంటలు..
Election Commission: భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఎన్నికల వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందా? ఓటర్ల డేటాబేస్, ఓట్ల నమోదుల వెనుక వ్యవస్థాగతంగా భారీ రిగ్గింగ్ జరుగుతోందా? ఈ సంచలన ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘంపై విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలు సాధారణ ఆరోపణల స్థాయిని దాటి, నేరుగా రాజ్యాంగ వ్యవస్థల ఉనికే ప్రమాదంలో పడిందన్న ఆందోళనను రేకెత్తిస్తున్నాయి."నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థమెక్కడుంది?" అంటూ విపక్ష నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఏదైనా ఒక రూపంలో అక్రమాలు జరుగుతుంటే, దానికి ఎన్నికల కమిషన్ సహకరిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికంటే తీవ్రమైన విషయం ఏమిటంటే — సాక్షాత్తు ఎన్నికల కమిషనర్‌కే ఈ అక్రమాలు, అవకతవకల గురించి తెలిసీ కూడా, వాటిని అడ్డుకోకుండా కళ్లప్పగించి చూస్తూ చోద్యం చూస్తుంటే... అది కేవలం పదవీ వైఫల్యం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అంతకుమించి అది ముమ్మాటికీ 'దేశానికి తీరని ద్రోహం.. క్షమించరాని దేశద్రోహం' అని విపక్షాలు వేదికలపై గర్హిస్తున్నాయి.
