తెలంగాణ

ఎల్‌నినో ఎఫెక్ట్.. కిలో రూ.80 దాటిన బియ్యం ధర

తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది వర్షాలు అనుకున్నంతమేర కురవకపోవడం, ఎల్‌నినో ప్రభావమే కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఆరు తడి పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వాలు, వ్యయసాయ నిపుణులు రైతులకు సూచించారు.దీంతో ఈ ఏడాది వరి దిగుబడి గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు కురవకపోయినా రైతులు మాత్రం ధాన్యం సాగుకే అధికప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం.అయితే, ఈసారి వరుసాగు దిగుబడి తగ్గుతుందని తెలుస్తుండగా.. మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. మూడు నెలల్లో కిలో బియ్యంపై రూ.15-20 పెరుగుదల నమోదైనట్టు సమాచారం. సన్నబియ్యం ప్రస్తుతం మార్కెట్లో రూ.70, నాణ్యమైన బియ్యం రూ.80కి పైగా ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది.