తెలంగాణ
ఎల్నినో ఎఫెక్ట్.. ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహకాలు : మంత్రి తుమ్మల
ఎల్నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ, మరోవైపు ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో నిర్వహించిన భేటీలో రాష్ట్రంలో ఉద్యాన పంటల పథకాల అమలు, ఆయిల్ పామ్ సాగు పురోగతి తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండటం సానుకూల పరిణామమని మంత్రి పేర్కొన్నారు. గతంతో పోలిస్తే స్పైసెస్ సాగు 65 శాతం, ఎర్రమిరప సాగు 83 శాతం, ఇతర సుగంధ ద్రవ్యాల సాగు 192 శాతం, పూల సాగు 198 శాతం పెరిగినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉద్యాన పంటల సాగులో నమోదవుతున్న ఈ పురోగతిని కొనసాగించడంతో పాటు మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
