తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడుల కలకలం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ(ED) దాడులు కలకలం రేపాయి. శుక్రవారం తెల్లవారుజామున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత పెట్టుబడుల యాప్స్ ద్వారా సామాన్యులను బురిడీ కొట్టిస్తూ రూ.వందల కోట్లు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలపై ఈడీ దాడులు చేసింది. నిందితులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి సోదాలు జరుపుతున్నారు.స్పాట్లో దొరికిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అనగా మొత్తం 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రలోని పూణె సైబర్ క్రైమ్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్రమ నెట్వర్క్ మూలాలను సేకరించే పనిలో ఈడీ అధికారులు నిమగ్నమయ్యారు. కీలక నిందితుల నివాసాలు, వారి కార్యాలయాల్లో ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. అక్కడ లభ్యమైన రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలు, డిజిటల్ పరికరాలను లోతుగా పరిశీలిస్తున్నారు.
