తెలంగాణ

SIR: ‘ఇదేం పని సర్’ దేశవ్యాప్తంగా ఈసీ ఎందుకు బద్నాం అవుతోంది?

SIR: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాణవాయువు పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ. ఆ ప్రక్రియకు గుండెకాయ వంటిది నిష్పాక్షికమైన ఓటర్ల జాబితా. స్వతంత్ర భారతంలో దశాబ్దాలుగా ఎన్నికల సంఘం (ఈసీ) అంటే ఒక అపారమైన విశ్వసనీయత ఉంటూ వచ్చింది. రాజకీయ పార్టీలు ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎన్నికల నిర్వహణలో ఈసీ తీసుకునే నిర్ణయాలకు ప్రజాక్షేత్రంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైనట్లు కనిపిస్తుందనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) కార్యక్రమం.. ఇప్పుడు అదే కమిషన్ మెడకు అతిపెద్ద ఉచ్చులా చుట్టుకుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.మ్యాపింగ్‌తో మొదలైన చిన్నపాటి సమస్యలు.. చివరకు సామాన్యుల నుంచి వీఐపీల వరకు లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే దుస్థితికి దారితీశాయని అంటున్నారు. ఇది చాలదన్నట్లు, ఏకంగా ఎన్నికల కమిషన్ అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టే స్థాయికి వ్యవహారం ముదరడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఎన్నికల సంఘం ఇంతలా ఎందుకు బద్నాం అవుతోంది? తెరవెనుక జరిగిన తప్పిదాలేంటి? అనేది తెలుసుకుందాం.