DPDP Act: పత్రికా స్వేచ్ఛకు ఉరితాడులా డిజిటల్ చట్టం?
DPDP Act: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్-2023 నిబంధనలు స్వతంత్ర జర్నలిజం ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయనే ఆందోళన దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లెక్కింది. వార్త రాయాలన్నా, పరిశోధనాత్మక కథనాలు ప్రచురించాలన్నా సదరు వ్యక్తుల ముందస్తు అనుమతి (కన్సెంట్) తప్పనిసరి అయితే దేశంలో పత్రికా రంగమే నిర్వీర్యమవుతుందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం, దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి అధికారిక నోటీసులు జారీ చేసింది.ఈ చట్టంలోని కొన్ని రూల్స్ వాస్తవ విలేకరితనానికి సంకెళ్లు వేసేలా ఉన్నాయని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ ధర్మాసనం ఎదుట బలంగా వాదించారు. ప్రతి వార్త వెనుక సమాచారం ప్రచురించేందుకు వ్యక్తుల ముందస్తు అనుమతి తీసుకోవాల్సి రావడం పరోక్షంగా "ముందస్తు సెన్సార్షిప్" కిందకే వస్తుందని పేర్కొన్నారు.
