యూనిఫాం ధరించి డ్యాన్సులు వేయొద్దు.. పోలీసు శాఖ కీలక ఆదేశాలు
పోలీసు ఉద్యోగులు యూనిఫామ్స్ ధరించిన సమయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అని వారికి తాజాగా మార్గదర్శకాలు జారీ అయినట్టు తెలుస్తోంది. కొందరు విధినిర్వహణలో ఇటీవల రూల్స్ బ్రేక్ చేసినట్టు భావించిన తెలంగాణ పోలీసు శాఖ ఈ మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరోసారి గుర్తుచేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో డీజేపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర పోలీసువర్గాల గ్రూపుల్లో ఈ ఆదేశాలు చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం. గత రెండు మూడేళ్లుగా ప్రైవేట్ కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలలో విధుల్లో పాల్గొనే పోలీసులు యూనిఫామ్‌లోనే డ్యాన్సులు వేయడం, స్పీచ్‌లు ఇవ్వడం, ప్రయివేటు కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వంటివి చేస్తున్నట్టు పోలీసుశాఖ గుర్తించింది. ఇటీవల వినాయక చవితి నిమజ్జన సమయంలో ట్యాంక్ మీద కొందరు పోలీసులు డీజే సప్పుళ్లకు డ్యాన్స్ చేయగా.. ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అందులో మహిళా పోలీసులతో పాటు పురుషులు కూడా ఉన్నారు.
