తెలంగాణ

మంత్రులు, ఎమ్మెల్యేలు టూర్లకు వెళ్తారా? : హరీశ్ రావు

రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. నీళ్లు లేక ఓవైపు పంటలు ఎండిపోతున్నాయని, తాగు నీటికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. కరువు పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. సాగుకు నీళ్లు లేక అన్నదాతలు జనరేటర్ల ద్వారా పంటకు నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కనిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జలాశయాల్లో నీరు ఎండిపొతున్నా రాష్ట్ర సర్కారు మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు.