గుండెలు ఆగుతున్నయ్.. చెవులు బద్దలవుతున్నయ్.. ఎందుకీ రాకాసి డీజేలు..?
DJ Sound: పండుగలు, ఊరేగింపులు, పెళ్లిళ్లు.. సందర్భం ఏదైనా వినోదం హద్దులు దాటి ప్రాణాంతకంగా మారుతోంది. భక్తి, ఉత్సాహం ముసుగులో రోడ్లపైకి వస్తున్న భారీ డీజే బాక్సుల చప్పుళ్లు మనుషుల ప్రాణాలను నిలువునా బలితీసుకుంటున్నాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలు, భూమి కంపించే బేస్ దరువుల తీవ్రతకు గుండెలు ఝల్లుమంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వేడుకలు, శోభాయాత్రల్లో డీజేల మోతలకు క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
డీజేల ధాటికి సరదాగా గడపాల్సిన వేడుకల్లో తీవ్ర విషాదం అలుముకుంటోంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ రాంనగర్ క్రాస్ రోడ్స్ సమీపంలో ఊరేగింపులో భారీ డీజే మోతకు డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల బీటెక్ విద్యార్థి అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద శబ్దాల తీవ్రత వల్లే కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అలాగే ఘట్కేసర్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ నిమజ్జన ఊరేగింపులో తీవ్రమైన శబ్దాల నడుమ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో నేలకొరిగి ప్రాణాలు విడిచారు.
