తెలంగాణ
తెలంగాణలో మరో కొత్త స్కీమ్.. ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా
Indiramma Bheema: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా దేశంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యం
గతంలో రాష్ట్రంలో అమలైన కొన్ని బీమా పథకాలు నిర్దిష్ట శాఖలు, కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. కుటుంబంలో ఉపాధి పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.
