యువకుడి ఇంటి కూల్చివేత.. ఏడుగురు నిందితుల అరెస్టు
స్వేచ్ఛ న్యూస్,గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఓ యువకుడి ఇంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు జేసీబీ సాయంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.గద్వాల మండలం రేపల్లి గ్రామంలో ఈ నెల 10న వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనపై గద్వాల రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో టీ. వీరన్న, పరశురాములు @ పరుష, వెంకటేష్ @ టీ. వెంకటేష్ నాయుడు, పరశురాములు, రామాంజనేయులు, గోపాల్, తిమ్మన్న @ తిమ్మప్పలను శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితులను అలంపూర్ జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి న్యాయ రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.
