బ్రిక్స్ సదస్సు.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం
Delhi Declaration : అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ, గ్లోబల్ మార్కెట్లను శాసించేందుకు కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలు, సుంకాల బాదుడుపై బ్రిక్స్ కూటమి సమరశంఖం పూరించింది. ఢిల్లీ వేదికగా ముగిసిన శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన చారిత్రక ‘ఢిల్లీ డిక్లరేషన్’ ద్వారా గ్లోబల్ ట్రేడ్ ప్రొటెక్షనిజంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాథమిక సూత్రాలను కాలరాస్తూ సాగుతున్న ఒంటెత్తు పోకడలను ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశాయి.డబ్ల్యూటీవో మార్గదర్శకాలకు విరుద్ధంగా పలు పాశ్చాత్య దేశాలు అమలు చేస్తున్న ఏకపక్ష వాణిజ్య సుంకాలు ప్రపంచ సరఫరా వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని బ్రిక్స్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చట్టాల పరిధికి బయట తీసుకుంటున్న ఆర్థిక నిర్బంధ చర్యలు కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలనే కాక, యావత్ ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని హెచ్చరించారు. ఈ విధ్వంసకర వాణిజ్య ఆంక్షలను తక్షణమే నిలిపివేయాలని, పారదర్శకమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థే అందరి అభివృద్ధికి ఏకైక పరిష్కారమని ‘ఢిల్లీ డిక్లరేషన్’ తేల్చి చెప్పింది.
