National

Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన విషపు పొగ.. పండుగకు ముందే డేంజర్ బెల్స్!

Delhi Air Pollution: దీపావళి పటాకుల శబ్దం ఇంకా మొదలుకాలేదు.. టపాసుల వెలుగులు అసలు చూడనేలేదు.. కానీ దేశ రాజధాని ఢిల్లీని మాత్రం అప్పుడే దట్టమైన విషపు పొగ చుట్టేసింది. ఏటా చలికాలం మొదట్లో నగరాన్ని భయపెట్టే వాయు కాలుష్యం ఈసారి పండుగ రాకముందే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిజానికి ఈ రోజు తెల్లవారుజాము నుంచే రోడ్లపై కమ్ముకుంటున్నది మామూలు పొగమంచు కాదని, ప్రాణాలకే ఎసరు పెట్టే విషవాయువులని తెలిసి ఢిల్లీ జనం వణికిపోతున్నారు.ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి చూస్తే అచ్చం ఒక 'గ్యాస్ ఛాంబర్'లో ఉన్నట్లే ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కల ప్రకారం.. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 391 పాయింట్లకు పడిపోయి ‘వెరీ పూర్’ కేటగిరీకి చేరింది. ద్వారక, రోహిణి, ఐటీవో, పంజాబీ బాగ్, జహంగీర్‌పురి లాంటి కీలక ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఒక్క ఢిల్లీలోనే కాదు.. పక్కనే ఉన్న నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ లాంటి నగరాల్లోనూ పరిస్థితి ఇంతే దారుణంగా మారింది.