తెలంగాణ

TG: రూ.1,000 కోట్ల బీసీ స్టడీ సర్కిల్ భూమి ప్రైవేట్ పరం.. రేవంత్ సర్కార్‌పై దాసోజు శ్రవణ్ ధ్వజం!

TG: తెలంగాణలో బీసీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా బడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేద బహుజన బిడ్డల ఆత్మగౌరవాన్ని, వారి విద్యావకాశాలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కురువ విజయ్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను బయటపెట్టారు.హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని సర్వే నెంబర్ 20/1 లో ఉన్న 3 ఎకరాల 17 గుంటల విలువైన స్థలాన్ని ‘ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా’ (SAS Infra) సంస్థకు దారాదత్తం చేశారని శ్రవణ్ ఆరోపించారు.