తెలంగాణ

Danam Nagender: దానం నాగేందర్‌ కేసు సుప్రీంలో వాయిదా.. అనర్హత వేట తప్పదా?

Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై స్టే కోరుతూ ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయితే తక్షణ ఉపశమనం కోసం ఆయన చేసిన ప్రయత్నాలకు అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ పిటిషన్‌ను వెంటనే అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని పక్కనపెట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధర్మాసనం, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ కేసు తీవ్రతను వివరించారు. స్పీకర్ తిరస్కరించిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు నేరుగా అనర్హత వేటు వేయడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకుని స్టే ఇవ్వకపోతే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయి, ఉప ఎన్నిక వచ్చే ప్రమాదం పొంచి ఉందని అత్యవసర విచారణను కోరారు.