TG: "దానం" డిస్మిస్.. ఉప ఎన్నికకు అప్పుడే అన్ని పార్టీల్లో జోరు
TG: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు విధించిన అనర్హత వేటును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించడంతో తాజాగా రాజధాని నడిబొడ్డున ఎన్నికల నగారా మోగింది. దానం వేసిన పిటిషన్‌ను విచారించేందుకే సుప్రీం నిరాకరించి కొట్టివేయడంతో ఆయనకు అన్ని దారులూ మూసుకుపోయాయి. స్పీకర్ కార్యాలయం నుంచి అధికారికంగా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ప్రకటన రావడమే తరువాయి.. ఇక ఆరు నెలల్లో ఉపఎన్నిక అనివార్యమౌతుంది.ఈ ఒక్క తీర్పుతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో అప్పుడే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ ‘బీ-ఫామ్’తో ఎంపీగా పోటీ చేయడమే దానం అనర్హతకు ప్రధాన కారణమైంది. ఇప్పుడు శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన దానం.. ‘నేను ఫైటర్ని, మళ్లీ గెలిచి చూపిస్తా’ అంటూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది కత్తిమీద సాములాంటి పరిణామం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక జరిగితే అది అధికార పార్టీ పనితీరుకు రెఫరెండంగా మారే ప్రమాదం ఉంది. దానం నాగేందర్‌కే మళ్లీ టికెట్ ఇచ్చి సానుభూతి, స్థానిక పట్టుతో గెలవాలా? లేక ప్రత్యామ్నాయ వ్యూహం రచించాలా? అన్న అంశంపై గాంధీ భవన్లో ఇప్పటికే సమాలోచనలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.
