‘దానం’ ఔట్.. దెబ్బకు మిగతా ఎమ్మెల్యేలు పీచేముడ్?
అధికార పార్టీలో సీన్ మారుతున్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ ఎపిసోడ్ అనంతరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలు ఆలోచనలో పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక ఆ పార్టీ గుర్తుమీద గెలిచిన సుమారు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిపై కొన్ని నెలల పాటు ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేయడంతో గడ్డం ప్రసాద్ కుమార్..పార్టీ మారిన వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. దానంకు క్లీన్చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఆయన బీఆర్ఎస్ గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో చేరి అనంతరం హస్తం పార్టీ బీఫాం మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.ఇదే విషయాన్ని గులాబీ నేతలు హైకోర్టులో అప్పీల్ చేయగా.. ఆయన సభ్యత్వంపై న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. ఇక పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.
