Current Bill Hike: తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్ ఇవ్వబోతుందా?
Current Bill Hike: ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాల ప్రచారాలతో ఊదరగొడుతున్న వేళ.. తెలంగాణ ప్రజలకు తెలియకుండానే వెనుక గుమ్మం నుంచి భారీ కరెంట్ షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధమైందా? సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై ఏకంగా రూ.5,420 కోట్ల పిడుగు పడబోతోందా? అంటే అందుతున్న సంకేతాలు ‘అవుననే’ స్పష్టం చేస్తున్నాయి. గతంలో వాడిన విద్యుత్‌కు సంబంధించి లెక్కలు సరిచేయాలంటూ డిస్కంలు తెరపైకి తెచ్చిన ‘ట్రూ అప్’ బాదుడుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) పచ్చజెండా ఊపడంతో, వచ్చే నవంబర్ నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటా కరెంట్ బిల్లుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ భారం ఏదో ఒకటి, రెండు నెలలు ఉండి సర్దుకుంటుందంటే పొరపాటే. ప్రజల జేబులను ఏళ్ల తరబడి ఖాళీ చేసేలా ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను రెడీ చేశారు. వచ్చే నవంబర్ నుంచి జారీ చేసే బిల్లుల్లో ప్రతి యూనిట్‌పై 30 పైసల ఎక్స్ట్రా ఛార్జ్ పడనుంది. ఇక డిసెంబర్ నుంచి ఏకంగా యూనిట్‌కు 50 పైసలకు పెంచనున్నారు. దక్షిణ డిస్కం (TGSPDCL) పరిధిలో ఏకంగా 29 నెలల పాటు, ఉత్తర డిస్కం (TGNPDCL) పరిధిలో 26 నెలల పాటు ఈ ఎక్స్ట్రా బాదుడు నిర్విరామంగా కొనసాగనుంది.
