కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎర్రవల్లిలో టెన్షన్ టెన్షన్
మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో ఎర్రవల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీకి రాకుండా రూ.కోటికి పైగా వేతనం తీసుకున్నారని, అలెవెన్సులు పొందుతున్నారని ఆరోపిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఆయన ఫామ్‌హౌస్‌ను ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో మార్కుక్ మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రవల్లి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.వెయ్యి మందికిపైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు సమాచారం. కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో కంచెను ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే మార్గాలను దిగ్బంధించి,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. డీఐజీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బలగాలు మోహరించాయి. ఫామ్‌హౌస్‌కు చుట్టపక్కల మూడు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
