దళితుల భూమిని తీసుకోం.. విషప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి పొంగులేటి
దళితులు, గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజాప్రభుత్వ విధానం కాదని, వారి అంగుళం భూమిని కూడా తీసుకోబోమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టంచేశారు.సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దళితుల భూములకు సంపూర్ణ రక్షణగా నిలుస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రెండున్నరేండ్ల క్రితం దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పాలనలో ఎప్పుడూ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయన్నారు. దేశంలో, రాష్టంలో పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేశారు.
