National

Congress : పార్టీ ఫిరాయిస్తే 10 ఏళ్లు నిషేధం విధించాలి : కపిల్ సిబల్

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ సరిపోవడం లేదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని పూర్తిగా మార్చాలని చెప్పారు. పార్టీ మారే ప్రజాప్రతినిధుల కోసం కఠిన నిబంధనలు తేవాలన్నారు. మధ్యలో పార్టీ మారిన ప్రజాప్రతినిధిని పదేళ్ల పాటు ప్రభుత్వ పదవి,ప్రజా పదవి లేదా రాజ్యాంగబద్ధమైన హోదా చేపట్టకుండా నిషేధించాలని అన్నారు. అప్పుడే ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందని కీలక ప్రతిపాదన చేశారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ‘ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్’ నిర్వహించిన ‘హార్స్-ట్రేడ్ అండ్ డెమోక్రసీ’ అంశంపై ప్రసంగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారిపైనే కాకుండా, రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికల్లో పోటీ చేసే కొత్త తరహా ఫిరాయింపులపైనా పదేండ్ల నిషేధం విధించాలని సిబల్ వెల్లడించారు.యాంటీ డిఫెక్షన్ చట్టంలోని రూల్స్ ఎలా దుర్వినియోగానికి గురయ్యాయో చెప్పేందుకు గతంలోని బీఎస్పీ ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.