తెలంగాణ

డ్రైవర్లు రాలేదని కండక్టర్లకు వేధింపులు.. ఇంటికి వెళ్లిపోవాలని!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడ ఆర్టీసీ డిపో వద్ద ఇవాళ ఉదయం స్వల్ప వివాదం నెలకొంది. విధులకు హాజరయ్యేందుకు డిపో వద్దకు వచ్చిన మహిళా కండక్టర్లను అధికారులు అడ్డుకున్నారు. విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని అనుమతించలేదు. ‘బస్ డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి’ అంటూ వారిని అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకుండా అడ్డుకున్నట్టు సమాచారం. దీంతో మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులకు కేటాయించిన డ్రైవర్లు విధులకు రాకపోతే మమ్మల్ని సెలవు పెట్టి వెళ్లాలని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు.విధుల్లోకి అనుమతించాలని డిపో ఎదుటే ఆందోళనకు దిగారు. ఉదయమే డిపోకు చేరుకున్నా అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని మహిళా కండక్టర్లు వాపోయారు. డ్రైవర్లు విధులకు హాజరు కాని సందర్భాల్లో తమను సెలవు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని మహిళా కండక్టర్లు తీవ్ర ఆరోపణలు చేశారు.