డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తిచేయండి : మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి
డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకేసారి లేఖలు రాశారు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానుసారం ఎదుల జలాశయం నుంచి డిండి ఎత్తిపోతల కోసం హెడ్ వర్క్స్ చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్బంగా లేఖలో కోరారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం డిండి లిఫ్ట్ స్కీమ్ సర్వేలకు 2007లో అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిండి ఎత్తిపోతల పథకం కోసం శ్రీశైలం జలాశయం నీటిని తీసుకునేందుకు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకంతో అనుసంధానం చేసిందన్నారు. 90 టీఎంసీలు పాలమూరు–రంగారెడ్డికి, 30 టీఎంసీలు డిండి ఎత్తిపోతల పథకానికి అని నిర్ధారించిందని గుర్తుచేశారు. కానీ, డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తీసుకోవడానికి అవసరమైన నిర్మాణం జరగలేదన్నారు.
