తెలంగాణ

మళ్లీ రావయ్యా.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి..

రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జన ఉత్సవాలు ఎంతో వైభవంగా,భక్తుల కోలాహలం నడుమ కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా, హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా వినాయక నిమజ్జన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు నగరవాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన ప్రసిద్ధ ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ట్యాంక్ బండ్‌‌పై ఏర్పాటు చేసిన క్రేన్ నెం.5 వద్ద ప్రశాంతంగా ముగిసింది. భక్తుల జయధ్వానాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ మహాగణపతికి అశేష భక్తజనం భావోద్వేగంతో.. ‘మళ్లీ రావయ్య గణపయ్యా’ అంటూ బడా గణేశ్‌కు వీడ్కోలు పలికారు.