తెలంగాణ

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ సూటి ప్రశ్నలు!

సిరిసిల్లకు వస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సూటి ప్రశ్నలు సంధించారు. తన నియోజకవర్గంలో 8 వేల ఎకరాలను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని సీఎం రేవంత్ ఇటీవల ఆరోపించగా.. ఆ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు ఓ లేఖ రాశారు.ఆ 8 వేల ఎకరాల్లో 2,400 ఎకరాలు రికవరీ చేసినట్లు చెబుతున్న వివరాలను బయటపెట్టాలన్నారు. నేతన్న, రైతన్న, విద్యార్థి, అన్ని వర్గాల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు.హామీల అమలుపై స్పష్టమైన తేదీలు ప్రకటించాలన్నారు. సిరిసిల్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయిన తర్వాత తొలిసారిగా సిరిసిల్లకు వస్తున్న సీఎం రేవంత్ ‌రెడ్డికి కేటీఆర్ స్వాగతం పలికారు.సీఎం హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు.