తెలంగాణ

TG: మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి

TG: మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ పురోగతికి బాటలు వేసిన మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకి ఏంటని సూటిగా ప్రశ్నించారు.రాజకీయ విభేదాలను పక్కనబెట్టి మేధావుల సేవలను స్మరించుకోవడమే నిజమైన పరిణితి అని సీఎం పేర్కొన్నారు. "దేశం క్లిష్ట ఆర్థిక, రాజకీయ ఒడిదొడుకుల్లో చిక్కుకున్న సమయాల్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకుని పాలనను గాడిన పెట్టారు. మౌనంగా ఉంటూనే పరిపాలనలో విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తికి ఇప్పటివరకు భారతరత్న దక్కకపోవడం బాధాకరం. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించి మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి" అని విజ్ఞప్తి చేశారు.