తెలంగాణ

ఫ్లాష్‌ సర్వే చేయించాం.. బీఆర్‌ఎస్‌దే తప్పని ప్రజలు చెప్తున్నారు : సీఎం రేవంత్

TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తాజాగా మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. గత మూడు రోజులుగా అసెంబ్లీ కేంద్రంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రభుత్వం నిర్వహించినట్లు చెబుతున్న ఫ్లాష్ సర్వే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వే ఫలితాలను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో పంచుకున్నారు.అసెంబ్లీ సమావేశాల టైంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు తీవ్రతరమైన వేళ ఈ ఫ్లాష్ సర్వే అంశం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, బీఆర్ఎస్ తీరుపైనే ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలో తేలిందంటూ సీఎం చెప్పడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపే అంశంగా మారింది.

అయితే ఇది ప్రభుత్వ అంతర్గతంగా నిర్వహించిన ఫ్లాష్ సర్వేకు సంబంధించిన సమాచారం కావడంతో.. దాని పూర్తి వివరాలు, నమూనా, సర్వే విధానం వంటి అంశాలు బయటకు వస్తేనే ప్రజాభిప్రాయంపై స్పష్టమైన అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.

మొత్తంగా చూస్తే.. అసెంబ్లీ రచ్చను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రయత్నిస్తున్న వేళ.. “ప్రభుత్వంపై యాంటీ లేదు.. బీఆర్ఎస్ తీరునే ప్రజలు తప్పుబట్టారు” అన్న రేవంత్‌రెడ్డి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి.