Revanth Reddy: ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. తుమ్మిడిహట్టి చిక్కుముడులు వీడేనా?
Revanth Reddy: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చిక్కుముడులను విప్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్న సీఎం, సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో అత్యంత కీలకమైన చర్చలు జరపనున్నారు.సోమవారం ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన కీలక ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. సరిహద్దు ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుంది.
