తెలంగాణ

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. రాష్ట్రానికి రూ.30వేల కోట్ల నిధులు?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అధికారికంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ అనుమతులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించిన ముఖ్యమంత్రి బృందం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక సహకారాన్ని కోరింది. ఈ సమావేశంలో ప్రస్తావించిన ప్రధానాంశాలు గమనిస్తే.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏర్పడిన లోటు వర్షపాతం, కరువు పరిస్థితులను ప్రధానికి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి, సుమారు 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తరఫున రూ.30వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.