తలరాతను మార్చే ఏకైక ఆయుధం విద్యే: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : "ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా.. అక్షర జ్ఞానానికి దూరమైతే సమాజంలో వెనుకబడిపోవడం ఖాయం. ఒక మనిషి తలరాతను, ఒక జాతి భవిష్యత్తును సమూలంగా మార్చే ఏకైక తిరుగులేని ఆయుధం విద్య మాత్రమే" అని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. విద్య, భవిష్యత్ తరాల పునర్నిర్మాణంపై మాట్లాడిన సీఎం, రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రకటించారు.2024లో రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సామాజిక సర్వే (సీపెక్) నివేదికలను ఉటంకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. సామాజికంగా ఎవరైనా వెనుకబడి ఉన్నారంటే దానికి ప్రధాన కారణం చదువు లేకపోవడమేనని ఆ సర్వే తేల్చిచెప్పిందన్నారు. "ప్రపంచవ్యాప్తంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలు వచ్చిన తర్వాత విద్యా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా మన బోధనా విధానాన్ని తీర్చిదిద్దాలి. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను నెలకొల్పిన పండిట్ నెహ్రూ మార్గంలో నడుస్తూ.. నేటి జెన్ జీ తరంతో పాటు రాబోయే జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల భవితవ్యాన్ని ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే నిర్మిస్తాం" అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
