సీజ్ చేసిన సత్యం రామలింగరాజు భూములు కేటీఆర్ భార్య పేరు మీదకు మార్చారు : సీఎం రేవంత్
CM Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు. నిషేధిత 22A భూముల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా, మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబంపై సీఎం చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం స్కాంలో ప్రభుత్వం సీజ్ చేసిన విలువైన భూములను సైతం అధికార బలంతో కేటీఆర్ తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయించుకున్నారని సభాముఖంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు.ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా భూ దోపిడీకి పాల్పడిందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే సత్యం రామలింగరాజు కుటుంబానికి చెందిన సంస్థల భూములను తమ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. సత్యం కంపెనీ వ్యవహారంలో గతంలో ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిన భూములను నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ బదిలీ చేసుకున్నారని అన్నారు. రామలింగరాజు కుటుంబానికి చెందిన ‘శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ భూములను ఆయన తన భార్య, అత్తమామల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.
