తెలంగాణ

నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలో పెట్టినవే : సీఎం రేవంత్

CM Revanth Reddy : తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ భూములపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగిన భూ బాగోతాన్ని బయటపెడుతూ అసెంబ్లీ సాక్షిగా బాంబు పేల్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలో ఏకంగా 388 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూమి అక్రమంగా కలిసిపోయిందని, దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో ఈ వ్యవహారం నడుస్తోందని ఆరోపిస్తూ సభను నివ్వెరపరిచారు. ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని, 800 మంది దళిత కుటుంబాలకు పట్టాల రూపంలో పంచిపెడతామని సంచలన అల్టిమేటం జారీ చేశారు.కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న ప్రాంతంలో జరిగిన భూ మార్పిడులపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1944 సర్వేల ప్రకారం ఎర్రవల్లి, షేర్ వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల్లోని భూముల వివాదాలను అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రికార్డుల్లో కేసీఆర్ కుటుంబం పేరిట ఉన్నది 295 ఎకరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే అదే ప్రాంతంలోని సర్వే నెంబర్ 325 పరిధిలో సుమారు 388 ఎకరాల ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి ఉందని ఆధారాలతో సహా సభ ముందుంచారు. 2017లో ధరణి ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన ముసుగులో భారీగా మార్పులు చేసి, రికార్డులు లేని ఈ 388 ఎకరాల ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 700 ఎకరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు.