పదేళ్లలో లక్ష కోట్ల దోపిడీ- కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ ఫైర్
Cm Revanth: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఎప్పటికీ నమ్మరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించని తప్పులను కేసీఆర్ కుటుంబం చేసిందని ధ్వజమెత్తారు. కొడంగల్ లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.
''సారాయి నుంచి మొదలుపెడితే లిక్కర్, నీళ్లు, పాలు, భూములు, గనులు... ఇలా ఒక్కొక్కరు ఒక్కో దాన్ని.. ఇంటిల్లిపాదిగా తెలంగాణను కొల్లగొట్టి లక్ష కోట్లు సంపాదించారు. లిక్కర్ వ్యాపారం సంతోష్ రావు తీసుకున్నారు. ఆంధ్రోళ్ల కంపెనీలకు పాలు అమ్మి, బ్లాక్ మెయిల్ చేసి హరీశ్ రావు వందల కోట్లు సంపాదించారు. భూములను కేటీఆర్, నీళ్లను కేసీఆర్ చెరబట్టారు. భూమి, ఆకాశం, గనులు, ఇసుక దేన్నీ వదల్లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. నేరెళ్ల బాధితులను లారీ కింద వేసి తొక్కించారు, ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన రైతులకే బేడీలు వేయించారు. వరి వేస్తే ఉరేసుకున్నట్లే అని రైతులను అవమానించారు. ఇవన్నీ అప్పుడే మర్చిపోయారని అనుకుంటున్నారా?'' అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్.
