క్రైమ్

లాటరీ పేరుతో కొత్త స్కెచ్.. ట్యాక్స్‌లు, జీఎస్టీ అంటూ మోసం!

చేవెళ్ల మండలం తంగడిపల్లి రెవెన్యూ పరిధిలోని మడికట్టుకు చెందిన దేవరి మల్లేశం సైబర్ మోసానికి బలయ్యారు. జులై 10న గుర్తుతెలియని వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి.. తాము కేరళ లాటరీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, మీకు రూ.8 లక్షల లాటరీ వచ్చిందని నమ్మించాడు. లాటరీ డబ్బులు పొందాలంటే బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలు పంపాలని చెప్పడంతో.. మల్లేశం వాటిని వాట్సాప్ ద్వారా పంపించారు. తర్వాత లాటరీ డబ్బులు విడుదల చేయాలంటే ప్రాసెసింగ్ ట్యాక్స్, నగదు బదిలీ చార్జీలు, జీఎస్టీ, ఎన్‌ఓసీ, కోర్టు అగ్రిమెంట్, నెఫ్ట్ చార్జీలు, టీడీఎస్, ఈ-స్టాంప్ పేపర్ అంటూ ఒక్కో కారణం చెబుతూ పదేపదే డబ్బులు అడిగారు. లాటరీ డబ్బులు వస్తాయన్న ఆశతో మల్లేశం విడతల వారీగా ఏకంగా రూ.7,47,468 పంపించారు. కానీ చివరకు అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు జులై 31న సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేశారు.