తెలంగాణ

ఆత్మగౌరవ ధిక్కార స్వరానికి నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ : కేసీఆర్

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఆమె త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళ్లు అర్పించారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరమని, అందుకు ఆమె నిలువెత్తు నిదర్శనమని మాజీ సీఎం కొనియాడారు. నిజాం పాలన సమయంలో నిరంకుశ రాచరిక పోకడలు, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా, రైతాంగం న్యాయమైన హక్కుల కోసం గళమెత్తిన ధీరవనిత అని ప్రశంసించారు. ఓ వైపు భూస్వామ్య శక్తులను ఎదురిస్తూనే, మరోవైపు చట్టాల పరిధిలో న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేసి గెలిచిన ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయం అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రస్తుత అస్తవ్యస్త పాలనా పరిస్థితుల్లో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ప్రజాస్వామిక పోరాట పంథా, తెలంగాణ సోయి నేటి యువత అనుసరించదగినదని స్పష్టం చేశారు.