CEC: దేశవ్యాప్తంగా రగులుతున్న ఎస్ఐఆర్ రగడ! సీఈసీ రాజీనామా చేయకతప్పదా?
CEC: భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా దావానలంలా రగులుతోంది. ఏకంగా 13 కోట్ల మంది ఓటర్లను అనుమానితుల జాబితాలో నెట్టేయడం, సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణకు తెరతీయడంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సీఈసీ రాజీనామా అస్త్రం సంధించాయి. వ్యవస్థల స్వయంప్రతిపత్తికే సవాలుగా మారిన ఈ సంక్షోభంలో సీఈసీ తన పదవికి రాజీనామా చేయకతప్పదా అనే పరిస్థితి నెలకొందా అనే చర్చ సర్వత్రా మొదలైంది.ఓటర్ల జాబితాను సరిచేయాల్సిన ప్రక్రియ కాస్తా పౌరుల ఓటు హక్కును హరించే స్థాయికి దిగజారిందన్న ఆరోపణలు క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. 'షిఫ్టెడ్, ఆబ్సెంట్' పేరుతో ఏకంగా 13 కోట్ల మంది ఓటర్లను అనుమానాస్పద జాబితాలో చేర్చడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది.
