క్రైమ్

మహిళను ఢీకొట్టిన కారు.. మా డ్రైవర్‌ను చంపుకోండి.. పైసలిచ్చేదిలేదంటున్న సినీ నిర్మాత!

హైదరాబాద్ మహానగరంలోని నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్‌ ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రముఖ సినీ నిర్మాత కారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బాధితురాలు ఒక్కసారిగా దూరంగా ఎగిరిపడినట్టు సమాచారం. వెంటనే బాధితురాలని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. ఈ ప్రమాదంలో సదరు మహిళ కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. అయితే, హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు చెల్లించాలని సదరు నిర్మాతను కుటుంబ సభ్యులు అడుగగా.. డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పినట్టు సమాచారం. ప్రమాదం చేసింది తాను కాదని, తన డ్రైవర్ అని.. కావాలంటే అతన్నిచంపుకోండని.. పైసలు మాత్రం ఇచ్చేదిలేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. సదరు నిర్మాతను బొమ్మకు మురళిగా గుర్తించారు.