తెలంగాణ

నేడు థర్మల్ ప్లాంట్ల పరిశీలనకు బీఆర్ఎస్ బృందాలు

రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్‌ల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై బీఆర్ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్స్‌కు వెళ్లి నిజనిర్ధారణ చేయనున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇందులో భాగస్వాములు కానున్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలైన తరుణంలో అటు ప్రజలు, ఇటు రైతుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నిన్న సచివాలయంలో కూడా పవర్, ఇంటర్నెట్ షట్‌డౌన్ అయినట్టు కథనాలు రావడంతో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సైతం విద్యుత్ శాఖ మీద సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.