తెలంగాణ

BRS: గులాబీ పార్టీలో భారీ ప్రక్షాళన? తేడా వస్తే ఇన్‌ఛార్జులపై వేటు తప్పదా!

BRS: తెలంగాణ భవన్‌లో ఇప్పుడు అంతర్గత సమీక్షల వేడి మామూలుగా లేదు. రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్ అధినాయకత్వం.. పార్టీలో పేరుకుపోయిన అలసత్వాన్ని వదిలించేందుకు సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధమవుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ‘లాస్ట్ వార్నింగ్’ చూస్తుంటే.. ఈ నెపంతో పార్టీలో ఒక భారీ ప్రక్షాళనకే గ్రౌండ్ సిద్ధమైనట్లు అర్థమవుతోంది.ఎన్నికలు జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల పరిధిలోకి ఆరు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 68 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. సాధారణంగా అభ్యర్థి ఖరారైన తర్వాతే ఎన్నికల హీట్ మొదలవుతుంది. కానీ ఈసారి వ్యూహం మార్చిన అధిష్ఠానం.. అభ్యర్థిని ప్రకటించకుండానే ఓటర్ల నమోదు బాధ్యతను పూర్తిగా అసెంబ్లీ ఇన్‌ఛార్జుల భుజస్కంధాలపై పెట్టింది.