తెలంగాణ

BRS: పట్టభద్రుల పోరుపై గులాబీ దళం ఎక్స్‌ట్రా కేర్.. ఓటర్ నమోదుతో పాటే అభ్యర్థుల వేట!

BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా కదలిక మొదలైంది. అయితే, అన్ని రాజకీయ పక్షాల కంటే ఒకడుగు ముందే మేల్కొన్న బీఆర్ఎస్ ఈసారి దూకుడుగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ఇంకా నెలల సమయం ఉన్నప్పటికీ, అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించి ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ సేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం ఇంత 'ఎక్స్‌ట్రా కేర్' తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందని అంటున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థులను ప్రకటించడం పార్టీల ఆనవాయితీ. కానీ గులాబీ దళం ఆ పాత పద్ధతికి స్వస్తి పలకాలని చూస్తోందట.