సింపతీ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పాకులాట.. మరి ప్రజా సమస్యలు..?
TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతోంది. కానీ ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదికగా భావించే అసెంబ్లీలో జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే మాత్రం అసలు అజెండా ఎప్పుడో పక్కకు వెళ్లిపోయిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా ఆరోపణలు, ప్రత్యారోపణలే కనిపించాయి. సభా కార్యక్రమాలు సజావుగా సాగడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది.
అసెంబ్లీలో మూడు రోజుల పాటు పెద్దగా చర్చ జరగకుండా, రాజకీయ వివాదాలకే పరిమితం అయ్యిందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నాలుగో రోజు కూడా 22ఏ అంశంపై కొంత సేపు చర్చ జరిగింది. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పోలిస్తే ఈ ఒక్క అంశంపై జరిగిన ఆ కొద్ది పాటి చర్చ ఎంత వరకు ఉపయోగపడిందన్న ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి మేధావి వర్గం వరకు వినిపిస్తున్నాయి.
