తెలంగాణ

Bonalu Story: కాకతీయుల నుంచి రాయల కాలం వరకు.. బోనాలకు వేల ఏళ్ల ఘన చరిత్ర!

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వెనుక శతాబ్దాల ఘన చరిత్ర దాగి ఉంది. సాధారణంగా 1816లో హైదరాబాద్‌లో విజృంభించిన ప్లేగు వ్యాధి నివారణ కోసమే బోనాలు ప్రారంభమయ్యాయని ప్రచారంలో ఉన్నప్పటికీ, చారిత్రక ఆధారాలు మాత్రం అంతకంటే వేల సంవత్సరాల ముందే ఈ సంప్రదాయం తెలంగాణ గడ్డపై వర్ధిల్లిందని స్పష్టం చేస్తున్నాయి. పురావస్తు పరిశోధనలు, ప్రాచీన ఆధారాలు ఈ విషయాన్ని నొక్కిచెబుతున్నాయి. చరిత్ర పరిశోధకుల కథనం ప్రకారం సుమారు మూడు వేల ఏళ్ల క్రితమే ఆషాఢ మాసంలో బోనం ఎత్తే ఆచారం ఉండేది. కామారెడ్డి జిల్లా పరిధిలోని రాతి గుట్టల్లో మహిళలు శిరస్సుపై బోనాలతో ఉన్న శిల్పాలు లభించడం దీనికి ప్రధాన నిదర్శనం. అలాగే 1600 ఏళ్ల కిందటి విష్ణుకుండినుల నాటి 'గర్భాపాత్ర' కీసరగుట్ట వద్ద దొరకడం ఈ పండుగ పురాతనత్వాన్ని చాటుతోంది. కాకతీయుల కాలంలోనూ ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగేవి.