తెలంగాణ

బోనాల వేడుక.. నగరంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు!

హైదరాబాద్‌లో బోనాల పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 9న జరగనున్న బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్దేశిత సమయాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయనున్నారు. ముఖ్యంగా చార్మినార్ జోన్ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు (48 గంటలు) మద్యం దుకాణాలతో పాటు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు పూర్తిగా మూతపడనున్నాయి.