అసెంబ్లీ సాక్షిగా కమలంలో కల్లోలం.. కాషాయ దళంలో ముదురుతున్న గ్రూపుల లొల్లి!
BJP : తెలంగాణ శాసనసభ వేదికగా కాషాయ దళం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రభుత్వంపై సమష్టిగా దాడి చేయాల్సిన కీలక సమయంలో, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ లైన్ ప్రకారం నడవాల్సింది పోయి, సొంత ఎజెండాలు, వ్యక్తిగత ఈగోలతో నేతలు ఒకరితో ఒకరు తలపడుతుండటంతో అసలు పార్టీ వైఖరి ఏమిటనేది సామాన్య కార్యకర్తకు సైతం అంతుచిక్కడం లేదు.అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలు చేశాయనే వాదన బలంగా వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌పై కూర్చోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తే ఎమ్మెల్యేలంతా కలిసి వెళ్లాలి, లేదంటే ముక్తకంఠంతో అందరూ డుమ్మా కొట్టాలి. కానీ, కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే వెళ్లి మంత్రుల పక్కన కూర్చొని నవ్వులు చిందించడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు సొంత క్యాడర్ నుంచే వెల్లువెత్తుతున్నాయి. మరికొందరైతే ఏకంగా సభలోనే మంత్రుల పనితీరును ఆకాశానికెత్తుతూ ప్రసంగాలు చేస్తుండటం తోటి పార్టీ నేతలకే మింగుడుపడటం లేదు.
