BJP Silence: మైలేజ్ పెంచుకునే పనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్.. సైలెంట్ గా బీజేపీ
BJP Silence: తెలంగాణ గడ్డపై ప్రస్తుతం రాజకీయం మొత్తం రియల్ ఎస్టేట్, భూ దందాల చుట్టూనే రౌండ్లు కొడుతోంది. ఎర్రవల్లి ల్యాండ్ ఇష్యూ నుంచి హైదరాబాద్ శివారుల్లోని వేల కోట్ల విలువైన ఆస్తుల వరకు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ప్రతిరోజూ మీడియా ముఖంగా ప్రెస్మీట్లు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో పతాక శీర్షికలు దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. అయితే ఈ రణరంగంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్న ‘అంతుచిక్కని మౌనం’ వెనుక కారణాలు ఏంటో సొంత పార్టీ క్యాడర్‌కే అర్థం కావడం లేదు. అయితే రాజకీయ వర్గాలు మాత్రం కాషాయ దళం మౌనం వెనక పెను రాజకీయ విస్ఫోటనం దాగి ఉందని అభిప్రాయపడుతున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ రోజూవారీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ ప్రజల్లో ఒకరిని మించి మరొకరు నిందలు వేసుకుంటుంటే.. కాషాయ పార్టీ మాత్రం ఈ రొంపిలోకి నేరుగా దిగకుండా వ్యూహాత్మకంగా సైలెంట్ అయింది. ఎర్రవల్లి రీ-సర్వే లొల్లిలో ఇరువర్గాల వాదనలను గమనిస్తూ, కాంగ్రెస్ - గులాబీ పార్టీలు రెండూ ఒకరి అక్రమాలను మరొకరు బయటపెట్టుకునే వరకు బీజేపీ వెయిట్ చేద్దాం అనే ధోరణి ఉన్నట్లు కనిపిస్తోంది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న భూ ఆరోపణల వల్ల అంతిమంగా ప్రజల్లో వారిద్దరి విశ్వసనీయత అడుగంటిపోతుందనేది కమలం పార్టీ లెక్క అని అంటున్నారు.
