పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావు
తమ డిమాండ్లను పరిష్కరించాలని పాలిటెక్నిక్ విద్యార్థినులు శనివారం సికింద్రాబాద్ పరిధిలోని సంగీత్ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే, ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ పాలిటెక్నిక్ విద్యార్థినులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వాహనాల్లో తరలించారు. విద్యార్థులను పోలీసు వాహనాల్లో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థినులను అరెస్టు చేసిన విషయం తెలియడంతో మాజీ మంత్రి హరీశ్ రావు ఓ పబ్లిక్ మీటింగులో విద్యార్థినులకు మద్దతుగా మాట్లాడారు. పాలిటెక్నిక్ విద్యార్థుల మీద కేసులు పెడుతున్న పోలీసులను హెచ్చరించారు. ‘మీ పోలీసులకు కూడా డీఏలు, సరెండర్ లీవులు, పీఆర్సీలు రావడం లేదు.. మీకు కూడా రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. మా పిల్లలను ఒక్క దెబ్బ కొట్టినా హరీష్ రావు అడ్డంగా ఉంటాడు.. ఖబర్దార్..!.కేసు పెట్టాల్సి వస్తే మీరు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీద. ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లల చదువు ఆగం చేసిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని బాండ్ పేపర్లు పంపి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి’ అని మండిపడ్డారు.
