తెలంగాణ
balapur-laddu: బాలాపూర్ లడ్డూకు వేలంలో భారీ ధర.. పాత రికార్డులన్నీ బద్దలు!
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈసారి సరికొత్త రికార్డులను సృష్టించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ వేలంలో 'అర్బన్ రియాలిటీ గ్రూప్'కు చెందిన 35 ఏళ్ల వ్యాపారవేత్త సామా ప్రణీత్ రెడ్డి అత్యధికంగా రూ.39లక్షలు పలికి స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం ప్రస్థానం ఏటేటా పెరుగుతూ నేడు రూ.39లక్షలకు చేరుకోవడం విశేషం. పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ ఈ ఏడాది అత్యంత భారీ ధరకు లడ్డూ వేలం సాగడంతో బాలాపూర్ ప్రాంగణమంతా భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనించింది. గతేడాది జరిగిన వేలంలో కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దాశరథ్ గౌడ్ రూ.35లక్షలకు లడ్డూను దక్కించుకోగా, ఈసారి ఆ రికార్డు సైతం బద్దలైంది.
