తెలంగాణ

రైతులపై దాడులు.. కాంగ్రెస్ పాలనలో అన్నదాత బతుకే ప్రశ్నార్థకం : హరీశ్ రావు

రాష్ట్రంలో అన్నదాతల మీద పోలీసుల దాడులు పెరుగుతున్నాయి. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఓ రైతు పట్ల ఎస్ఐ కర్కశంగా వ్యవహరించారు. తప్పు ఎవరిదో ఆరా తీయకుండా విచక్షణా రహితంగా దాడికి పాల్పడటంతో పాటు దుర్బాషలాడినట్టు కూడా తెలుస్తోంది.ఎస్ఐ దాడిలో సదరు రైతు తలకు తీవ్ర రక్తస్రావం జరిగింది. గజ్వేల్‌కు చెందిన భీమరి రవి అనే యువరైతు తన సమస్య చెప్పుకునేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన వ్యవసాయ పొలంలో పంట సాగు విషయంలో పొరుగువారితో వివాదం తలెత్తిన నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కరెంటు ఎప్పుడు వస్తుందని ఎస్ఐ అడుగగా తనకు తెలియదని సమాధానం ఇచ్చానని బాధితుడు రవి పేర్కొన్నాడు. దీంతో పీకడానికి వ్యవసాయం చేస్తున్నావా? అంటూ ఎస్ఐ తనను కొట్టాడని, రక్తం కారుతున్నా కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.