తెలంగాణ

మహబూబ్‌నగర్‌లో అమానుషం..రైతు చొక్కా పట్టుకుని లాక్కెళ్లి ఎస్ఐ దాడి

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ రైతు తనకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం ప్రభుత్వానికి ఎదురుతిరిగాడు. జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ గ్రామంలో రిజర్వాయర్ కోసం నర్సింహులు అనే రైతు 1.28 ఎకరాల భూమిని ఇచ్చాడు. అందులో 20 గుంటలకు ఇంతవరకు పరిహారం రాలేదని ఆందోళన చెందాడు. అధికారులను ప్రశ్నించగా వారి నుంచి సమాధానం కరువైంది.దీంతో ఏం చేయాలో తెలియక తనకు పరిహారం వచ్చేంత వరకు ఆ 20 గుంటల భూమిలో సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తనకు పరిహారం అందని 20 గుంటల్లో సాగు చేసేందుకు వెళ్లగా ప్రాజెక్టు కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించినట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మల్లేశ్.. రైతు నర్సింహులుపై చేయి చేసుకుని, చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలోనే సదరు రైతు కాంట్రాక్టర్, పోలీసుల కాళ్లు మొక్కినట్టు తెలుస్తోంది.