తెలంగాణ

అశ్విని అనుమానాస్పద మృతి ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ స్పందన

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం కమ్మదనం గురుకులంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని అశ్విని అనుమానాస్పద మృతి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా హెచ్‌ఆర్‌ కేసు నం. 3641/2026లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌కు కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను 2026 నవంబర్‌ 9లోగా సమర్పించాలని ఆదేశించింది.విద్యార్థిని మృతి ఘటనకు సంబంధించిన పరిస్థితులు, విద్యార్థుల భద్రత, సంస్థాగత బాధ్యతలపై సమగ్ర వివరాలను నివేదికలో పొందుపరచాల్సి ఉంది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల నేపథ్యంలో ఘటనకు ముందు, తరువాతి పరిస్థితులు, పర్యవేక్షణ, వైద్య సహాయం, సంబంధిత అధికారుల విధుల నిర్వహణ వంటి అంశాలపై వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.